Health
oi-Garikapati Rajesh
వేసవి కాలాన్ని ఆయుర్వేదం గ్రీష్మ రుతువుగా చెబుతుంది. సూర్యుడు తన తాపంతో మన బలాన్ని గ్రహిస్తుంటాడు. వేసవిలో మనిషికి బలాన్ని కలిగించే కఫ దోషం వికృతమవుతూ వస్తుంది. వేడివల్ల ఒంట్లో కఫం కరిగి ద్రవపదార్థంగా రూపాంతరం చెందుతుంది. జఠరాగ్నిని చల్లబరిచి, అగ్ని మాంద్యానికి దారితీసేలా చేస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గడమే కాకుండా తిన్నదేదీ జీర్ణం కాదు.
అగ్నిమాంద్యమే శరీరంలో తలెత్తే వ్యాధులకు కారణమని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే శరీర పోషణకు ఆహారమే కీలకంగా మారుతుంది.

* వేసవిలో గోధుమలతో చేసిన ఆహారం ప్రశస్తం. పూరీ వంటివి కాకుండా గోధుమలు, గోధుమ రవ్వతో అన్నం, ఉప్మా వంటివి తీసుకోవడం చాలా మంచిది.
* వేసవిలో పుల్లటి పెరుగు మంచిది కాదు. తీయటి పెరుగే తినాలి. అవసరమైతే పెరుగులో పంచదార కలుపుకొనైనా తినాలి.
* పాలతో చేసిన పాయసాలు, గోరువెచ్చటి పాలలో అటుకులు వేసి, కొంచెంసేపు ఆగిన తర్వాత తినటమూ మేలు చేస్తుంది.
* నీటిలో పచ్చ కర్పూరం, తేనె, పంచదార, నెయ్యి, పిప్పలి కలిపి పంచదార పాకం చేస్తారు. ఇది దాహాన్ని, మంటను, నీరసాన్ని తగ్గిస్తుంది.
* రాత్రిపూట గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి నానబెట్టాలి. తర్వాతరోజు ఉదయం ఆ నీటిని తాగడంవల్ల ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది.
* తేలికగా అరిగిపోయే ఆహారం తీసుకుంటుండాలి.
* ఆహారం కాస్త జిడ్డుగా ఉండేలా చూసుకోవాలి. శరీరంలో స్నిగ్ధత్వం లేకపోతే పొడిబారుతుంది. కాస్త జిడ్డుగా ఉండే నెయ్యి, నూనె వంటి పదార్థాలను మితంగా తీసుకుంటుండాలి. దీనివల్ల జఠరాగ్ని పెంపొంది ఆహారం జీర్ణమవుతుంది.
* వేసవిలో బచ్చలికూర, క్యాబేజీ, కరివేపాకు, అరటి పూవు, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ, పొన్నగంటి కూర వంటివాటిని తినాలి. వంటి చిది.
* అంజీరా, ఖర్చూరం, ద్రాక్ష, బత్తాయి, దానిమ్మ, పనస, బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలి. తీయగా ఉండే పండ్ల రసం మనిషికి బలాన్ని కలగజేస్తుంది. వాతాన్ని తగ్గించి కఫాన్ని పెంపొందిస్తుంది.
* పేలాల పిండిలో పంచదార కలుపుకొని తింటే శరీరానికి మంచి చలువ చేస్తుంది.
* చెరుకు రసం తాగటం కన్నా చెరుకు ముక్కలు బాగా నమలటం మంచిది. నమిలే సమయంలో లాలాజలంతో కలిసిపోయే రసం దాహాన్ని తగ్గించడమే కాకుండా చలువ చేస్తుంది.
* గ్లాసులో పావు వంతు నిమ్మరసం, మూడొంతుల నీరు కలిపి తీసుకోవడం చాలా మంచిది. కాస్త జిలకర పొడి కూడా కలుపుకొంటే మరింత మేలు.
* మూడు పాళ్లు పెరుగు, ఒక వంతు నీరు కలిపి చిలక్కొట్టి చేసిన మజ్జిగ (తక్రం) తేలికగా జీర్ణమవుతుంది. ఆకలిని పెంచుతుంది. అయితే దీన్ని మితంగానే తీసుకోవాలి.
* స్నానం చేయటానికి ముందు ఒంటికి కొబ్బరి నూనె రాసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది.
* రాత్రి పడుకునే ముందు మాడు మీద, పాదాలకు కొబ్బరినూనె రాసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
English summary
Ayurveda refers to summer season as Grisma Rutu..
Story first published: Monday, April 3, 2023, 15:20 [IST]